కన్నడ కింగ్ ఎవరో ?

కర్ణాటక రాజకీయం థ్రిల్లర్ గేమ్ లా మారింది. 104 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ… కాంగ్రెస్-JDSల పోస్ట్ పోల్ అలయన్స్ మధ్య పోరాటం జరుగుతోంది. ఓటర్లు ఇచ్చిన హంగ్ తీర్పు… అనేక రాజకీయ సమీకరణాలకు తెరతీస్తోంది. 78 సీట్లు గెలిచిన కాంగ్రెస్… 37 సీట్లతో మూడో స్థానంలో ఉన్న JDSకు మద్దతు ప్రకటించి… సంచలనం రేపింది. దీంతో కింగ్ మేకర్ అవుతుందనుకున్న JDS ఇప్పుడు కింగ్ అయ్యే పరిస్థితి వచ్చింది.

కాంగ్రెస్ ఎత్తులతో అలర్ట్ అయిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా… మిషన్ కర్ణాటకను ప్రారంభించారు. కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డాలు బెంగళూరు వెళ్లారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప కూడా అనుక్షణం అమిత్ షాతో టచ్ లో ఉంటున్నారు. సాయంత్రం 5గంటలకు కేంద్రమంత్రి అనంత్‌కుమార్, పార్టీ నేతలు మురళీధర్‌ రావు, శ్రీరాములు, ఎంపీ శోభా కరంద్లాజేలతో కలసి గవర్నర్‌ వజుభాయ్‌ వాలాను కలిశారు యెడ్యూరప్ప. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు వారం రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఈ ఉదయం 11గంటలకు బీజేపీ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. యెడ్యూరప్పను తమ నేతగా ఎన్నుకోనున్న బీజేపీ ఎమ్మెల్యేలు… తర్వాత గవర్నర్ ను కలవనున్నారు.

బీజేపీ తర్వాత కాంగ్రెస్-JDS కూటమి నేతలు గవర్నర్ ను కలిశారు. సిద్ధరామయ్య రాజీనామా లేఖ అందజేశారు. తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కుమారస్వామి లెటర్ ఇచ్చారు. JDSకు మద్దతుగా కాంగ్రెస్ కూడా లేఖ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు కుమారస్వామి. జేడీఎస్‌కు షరతుల్లేని సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఇద్దరు స్వతంత్రులు సహా తమకు 118 మంది బలం ఉందన్నారు.

తర్వాత కాంగ్రెస్-JDS నేతలు సమావేశమయ్యారు.JDS అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్, వీరప్ప మొయిలీ, సీఎం సిద్ధరామయ్య, JDS నేత కుమారస్వామి, రెండు పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పొద్దు పోయిన తర్వాత హోటల్ కు చేరుకున్నారు. అక్కడే చర్చలు జరిగాయి. ఇవాళ కాంగ్రెస్, JDS ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. మీటింగ్ లో చేసిన తీర్మానం కాపీని గవర్నర్ కు అందజేయనున్నారు. తమకు మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన దానికంటే ఎక్కువ సీట్లు ఉన్నాయని… తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని గవర్నర్ ను కోరనున్నారు.

మరోవైపు కాంగ్రెస్-JDSల పోస్ట్ పోల్ అలయన్స్ ని బ్రేక్ చేసే పనిలో ఉంది బీజేపీ. ఆ రెండు పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేసే పనిలో ఉన్నారు బీజేపీ నేతలు. ఆరుగురు కాంగ్రెస్‌ లింగాయత్‌ ఎమ్మెల్యేలు, ఆరుగురు JDS ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు దేవెగౌడ పెద్దకొడుకు హెచ్‌.డీ రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన JDSలోంచి ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. 

బీజేపీ వ్యూహాలతో తమ ఎమ్మెల్యేలను చేజారనివ్వకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది. ఎమ్మెల్యేలను క్యాంప్ లకు తరలించే ప్రయత్నాల్లో ఉంది. JDS ఎమ్మెల్యేలను కూడా క్యాంప్ కు తరలించాలని ఆ పార్టీ భావిస్తోంది. గవర్నర్ నిర్ణయం వచ్చే వరకు ఎమ్మెల్యేందరినీ అజ్ఞాత ప్రదేశానికి తరలించే ఆలోచనలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోవడంతో ఈ రెండ్రోజులు కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS