పవన్ కల్యాణ్ మళ్లీ జనం బాట పట్టారు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మళ్లీ జనం బాట పట్టారు. మూడు రోజుల పర్యటన కోసం చిత్తూరు జిల్లాకు వెళ్లారు. శనివారం రాత్రి తిరుపతి చేరుకున్న ఆయన..  కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. నిన్న ఉదయం సామాన్య భక్తులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఇవాళ కొండపై ఉన్న పలు క్షేత్రాలను పవన్ దర్శించనున్నారు.

మరో రెండ్రోజుల పాటు చిత్తూరు జిల్లాలోనే ఉండనున్నారు పవన్. తిరుపతి శివారులో ఉన్న శెట్టిపల్లి భూముల బాధితులతో సమావేశం కానున్నారు. శెట్టిపల్లిలో 60 ఏళ్ల నుంచి భూములు వివాదాల్లో ఉన్నాయి. 620 ఎకరాల్లో ఉన్న భూముల్ని 200 కుటుంబాలు సాగు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. అయినా వారికి రెవిన్యూ పరంగా ఎలాంటి హక్కులు, యాజమాన్య పట్టాలు లేవు. దీనిపై చాలా ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు బాధితులు. ఇటీవల హైదరాబాద్ లో పవన్ ను కలిసి తమ సమస్యను వివరించారు. ఇప్పటికే శెట్టిపల్లి భూములపై జనసేన పార్టీ ఓ డాక్యుమెంటరీ తయారు చేసింది. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు కూడా భూములకు పట్టాలిస్తామని హామీనిచ్చి పట్టించుకోవడం లేదని బాధితులంటున్నారు.

చిత్తూరు హైవే విస్తరణలో భూములు నష్టపోయిన బాధితుల తోనూ సమావేశం కానున్నారు పవన్. తర్వాత బస్సు యాత్ర షెడ్యూల్ ను ప్రకటించే చాన్సుంది.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS